పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్.వి ఫౌండేషన్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా, మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో వివిధ రకాల పరీక్షలు, వైద్య సేవలు అందించడంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఎన్ ఎన్ కే దుర్గ, పీర్జాదిగూడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మిరాకిల్ హాస్పిటల్ వైద్యులు, బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి తగిన చికిత్స అందించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. మిరాకిల్ హాస్పిటల్ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 300 మంది మహిళలు, పిల్లలు వైద్య సేవలు పొందారు. రక్తపరీక్షలు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.