నాలుగు నెలల చిన్నారి మృతి కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత మహిళ షహజాది ఖాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) మరణశిక్ష అమలు చేశారు. గత నెల 15న ఈ శిక్షను అమలు చేసినప్పటికీ, ఈ విషయాన్ని సోమవారం భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. 2022లో అబుదాబీలో ఓ కుటుంబంలో పని చేసిన ఖాన్‌పై, అక్కడి యజమానుల కొడుకు మృతి చెందిన కేసులో అభియోగాలు నమోదయ్యాయి.
2022 ఆగస్టులో యజమాని కుటుంబంలో ఓ బాలుడు జన్మించగా, అతని సంరక్షణను షహజాది ఖాన్ చూస్తోంది. డిసెంబర్ 7న సాధారణ టీకాలు వేయించిన తర్వాత ఆ చిన్నారి మరణించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి 2023 ఫిబ్రవరిలో కోర్టు మరణశిక్ష విధించింది. షహజాది ఖాన్ తండ్రి భారత ప్రభుత్వాన్ని ఆమెను రక్షించమని వేడుకున్నా, యూఏఈ చట్టాల కారణంగా ఏ ప్రయత్నాలూ ఫలించలేదు.
యూఏఈ కోర్టు తీర్పు ప్రకారం ఫిబ్రవరి 15న షహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలు చేశారు. దీనిపై భారత రాయబార కార్యాలయానికి ఫిబ్రవరి 28న అధికారిక సమాచారం అందింది. ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ చైతన్ శర్మ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. భారత విదేశాంగ శాఖ తరఫున చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మరణశిక్ష అమలు చేసేముందు ఖాన్‌ను ఆమె చివరి కోరిక ఏమిటని అధికారులు ప్రశ్నించారు. తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆమె కోరడంతో, జైలు అధికారులు ఫోన్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. తాను నిర్దోషినేనని తల్లిదండ్రులకు చెప్పిన ఖాన్, వారి కోసం విలపించింది. అనంతరం అధికారులు మరణశిక్షను అమలు చేశారు.