ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ చర్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన చర్చ వాడీవేడిగా మారిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
అమెరికా తన భాగస్వాములంతా శాంతికి కట్టుబడి ఉండాలని కోరుకుంటుందని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న మిలటరీ సాయం వాస్తవంగా సమస్య పరిష్కారానికి దోహదపడుతుందా? లేదా? అనే అంశాన్ని సమీక్షిస్తున్నామని, అందుకే తాత్కాలికంగా సాయాన్ని నిలిపివేశామని వెల్లడించారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ పరిస్థితిని మరింత క్లిష్టం చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ తన తాజా వ్యాఖ్యల్లో ఉక్రెయిన్ తనకు అందిస్తున్న సహాయంపై కృతజ్ఞత చూపడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన ఆయుధాలను పోలండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చర్య ఉక్రెయిన్‌కు తీవ్ర సమస్యగా మారవచ్చని రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు అంటున్నారు.
ఇక జెలెన్‌స్కీ మాత్రం రష్యాతో యుద్ధం ముగింపు దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యలపై ఉక్రెయిన్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయగా, నాటో సభ్యదేశాలు కూడా ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్‌లో ఉక్రెయిన్‌పై అమెరికా విధానంలో మరిన్ని మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.