నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థల పన్ను, షాపు రూముల బాడుగల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ పరిపాలనా కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి 100% లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
సచివాలయ కార్యదర్శులు రోజువారీ సమీక్షలు నిర్వహించి పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులోపు చెల్లించకుంటే తాగునీటి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వసూళ్లను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామ్మూర్తి నగర్, ఆదిత్య నగర్, బర్మాషల్ గుంట సచివాలయ ఇన్చార్జి కార్యదర్శులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. కొత్త భవనాలను గుర్తించి వాటిని ఆస్తి పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు శరత్, సందీప్, వంశీదర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. 31వ తేదీ నాటికి లక్ష్యాలను చేరుకోని కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.