రోడ్డు ప్రయాణాల సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని వరంగల్ రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వరంగల్ రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
నాయుడు పంపు జంక్షన్ వద్ద 200 మంది ఫోర్త్ బెటాలియన్ పోలీసులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటించాలని అధికారులు తెలిపారు.
రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలు సహకరించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.