సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ రూ. 450 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్క్ రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సింగపూర్ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌పై ఒప్పందం కుదిరింది.
క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు ఐటీ పార్క్ యూనిట్లు కలిగి ఉంది. అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ వంటి ప్రాజెక్టులు ఈ సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. అలాగే, ఐటీపీహెచ్ రెండో దశ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమై 2028 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది.
రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించింది. ఈ పర్యటన విజయవంతంగా ముగిసిన అనంతరం, బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరింది. అక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి చర్చలు జరపనుంది.
హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఫ్యూచర్‌సిటీలో మరో కీలక ప్రాజెక్ట్‌గా టెలీ మీడియా గ్లోబల్ సెంటర్ అధునాతన ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ రూ. 3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అలాగే, తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం సింగపూర్ ఐటీఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.