ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. వాటిలో ముఖ్యంగా, ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించినట్లు వివరించారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని వర్మకు 15 రోజుల గడువుతో నోటీసులు పంపించామని తెలిపారు.
జీవీ రెడ్డి మాట్లాడుతూ, ఫైబర్ నెట్ లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపించారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ కు రూ.12 కోట్ల అప్పును పెడగా, రూ.900 కోట్ల బకాయి కూడా పెంచిందని ఆయన వెల్లడించారు. ఈ మొత్తాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఫైబర్ నెట్ లో అక్రమ నియామకాలు జరిపినట్లు జీవీ రెడ్డి చెప్పారు. పలు అసమర్ధుల్ని అక్రమంగా నియమించారని, వారిలో కొందరు వైసీపీ నేతల ఇళ్లలో పనులు చేసారన్నారు. దీంతో 410 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు.
అక్రమ నియామకాలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. వారు తిరిగి మాట్లాడితే వేతనాల రికవరీ, తదితర కేసులు పెడతామని జీవీ రెడ్డి హెచ్చరించారు.