శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్-642 విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ విమానం దోహా నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళుతుండగా, ఒక మహిళా ప్రయాణికురాలు గుండెపోటుకు గురైంది. తక్షణమే విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించడంతో, అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరారు.
సంబంధిత శాఖలు అనుమతినిచ్చిన వెంటనే మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటికే విమానాశ్రయ సిబ్బంది, వైద్య బృందం అప్రమత్తమై, అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే గుండెపోటుకు గురైన మహిళను ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె మృతి చెందారు. ఈ ఘటనతో సహ ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేసే ఏర్పాట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలిపారు. కాగా, మృతురాలి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఘటన విమాన ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆందోళన రేపుతోంది.