పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడంలో చంద్రబాబు కూడా భాగస్వామి అయితే, దానికి అసలు కర్త, కర్మ, క్రియ జగనే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారా? అని నిలదీశారు.
ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించింది వైసీపీ కాదా? అని ఆమె ప్రశ్నించారు. నాటి ప్రధానమంత్రికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్లకే నిధులు మంజూరు చేయాలని కోరింది వైసీపీ నేతలే కాదా? అని షర్మిల నిలదీశారు. ఈ ప్రాజెక్టును అర్థంతరంగా నిలిపివేయడానికి అధికార పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు చెబుతూ, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె మండిపడ్డారు. 41.15 మీటర్ల ఎత్తుకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తే, మళ్లీ 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య కాదా? అని ప్రశ్నించారు.
ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు నిజం కాకపోతే, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన తెప్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ఉన్న రాజకీయ నేతలు, కేంద్రం ముందుకు వెళ్లి నిజాలను బయటపెట్టాలని ఆమె సవాల్ విసిరారు. పోలవరం విషయంలో ఏ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసిందో ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.