భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక మైలురాయి చేరనున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ తొలి వారంలో భారత పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశముంది.
ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగాలు లభించడమే కాకుండా, కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కలగనుంది.
రష్యా వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. నిర్మాణం, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత్ నుంచి నిపుణులను ఆహ్వానిస్తోంది.
ఈ ఏడాది చివరి నాటికి 70,000 మందికి పైగా భారతీయులు రష్యాలో అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా.
ALSO READ:హైదరాబాద్లో ఉగ్రవాది అరెస్ట్ – సామూహిక విషప్రయోగం
మాస్కోలోని “ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA)” ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, ఇది ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది.
ఐబీఏ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ మాట్లాడుతూ, “భారత్ వద్ద నైపుణ్యం గల వర్క్‌ఫోర్స్ ఉంది. రష్యా పారిశ్రామిక వృద్ధి దశలో ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకు లాభదాయకం అవుతుంది” అని అన్నారు.
గతంలో చోటుచేసుకున్న నకిలీ రిక్రూట్‌మెంట్ మోసాలను నివారించేందుకు ఐబీఏ, ఇరు దేశాల ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. రష్యాకు వెళ్లే కార్మికులకు భాషా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నైతిక నియామక ప్రక్రియలను పాటించనుంది.
భారత రాయబార కార్యాలయం కూడా రష్యా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, భారత కార్మికుల సంక్షేమం కోసం సహకరించనుంది.
