ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ స్టేషన్‌లో అశ్లీల నృత్యం – తొమ్మిది మంది పోలీసులు సస్పెండ్


ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా బదలాపుర్ పోలీస్ స్టేషన్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంతో, పోలీసుల గౌరవానికి భంగం కలిగింది. స్టేషన్ ప్రాంగణంలోనే యువతులు సినిమా పాటలకు నృత్యం చేస్తుండగా, అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ సరదాగా గడపడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదంగా మారింది.


ఎస్ఎచ్‌ఓపై వెంటనే చర్య

వీడియో బయటకు రావడంతో జిల్లా ఎస్‌పీ డాక్టర్ కౌస్తుభ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే బదలాపుర్ ఎస్‌హెచ్‌ఓ అరవింద్ కుమార్ పాండేను సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు బాధ్యతను రూరల్ ఎస్‌పీకి అప్పగించారు.


తొమ్మిది మంది సస్పెండ్

ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటనలో ఎస్‌హెచ్‌ఓతో పాటు మరికొంతమంది పోలీసుల నిర్లక్ష్యం తేలింది. అనంతరం సమగ్ర దర్యాప్తులో రెండు మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులు తప్పు చేసినట్లు నిర్ధారించడంతో, వారిని కూడా సస్పెండ్ చేశారు.


ఎస్పీ హెచ్చరిక

ఈ ఘటనపై రూరల్ ఎస్‌పీ అతీశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ –
“కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. వీడియో ఆగస్టు 16న వైరల్ కావడంతో వెంటనే విచారణ మొదలుపెట్టాం. ఇప్పటి వరకు తొమ్మిది మంది పోలీసులు తప్పు చేసినట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేశాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎవరైనా మరింతగా ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.


ప్రజల్లో ఆగ్రహం

పోలీస్ స్టేషన్‌ లోగో కనిపించే వీడియో బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. చట్టాన్ని కాపాడాల్సిన వారు ఇలాంటి కార్యక్రమాలకు ఆసరా కల్పించడం వల్ల పోలీస్ శాఖ ప్రతిష్ఠ దెబ్బతిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *