మూడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీల్లో భాగంగా కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్స్ పాఠశాల మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్, ఆర్ముడ్ పోలీస్ విభాగాల మధ్య జరిగిన ఈ పోటీకి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపి ఆటగాళ్లను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా పోలీసు విభాగాల మధ్య మైత్రీ, స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. పోటీల్లో క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు.
పోలీసు శాఖలో ఉద్యోగస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని సిపి తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసులు క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో పాల్గొంటున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులైన డీసీపీలు, ఏసీపీలు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి, క్రీడా ప్రియులను ఆకట్టుకుంది. పోటీల విజయవంతమైన నిర్వహణకు కమిషనరేట్ కృషి చేస్తుందని తెలిపారు.