కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక పాత్రధారి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి, ఈ వ్యవహారంలో ముఖ్య వ్యక్తులు ఎవరో తనకు తెలుసని స్పష్టం చేశారు.
కామన్ ఫ్రెండ్ ద్వారా విక్రాంత్ రెడ్డికి కేవీ రావును పరిచయం చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే, తనకు పోర్టు యజమాని కేవీ రావుతో ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. జగన్‌ను రక్షించేందుకు తనను ప్రశ్నించారా అని సీఐడీ అధికారులు అడిగారని, కానీ ఈ వ్యవహారానికి జగన్‌కు సంబంధం లేదని తాను చెప్పానని వెల్లడించారు.
వైవీ సుబ్బారెడ్డికి, కేవీ రావుకు మంచి సంబంధాలున్నాయని, అమెరికాలో ఆయన దగ్గరే వైవీ సుబ్బారెడ్డి ఉండేవారని విజయసాయి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అభిప్రాయపడ్డారు. ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డే అని స్పష్టం చేశారు.
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేస్తున్నానని, భవిష్యత్తులో తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పట్టించుకోనని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో తనకు నాయకుడిపై భక్తి ఉండేదని, ఇప్పుడు దేవుడిపై భక్తి ఉందని వ్యాఖ్యానించారు. తాను ప్రలోభాలకు లొంగలేదని, తనపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు.