పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం, చింతలపూడి పంచాయతీకి చెందిన వీరబద్రిపేట గిరిజన గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కోసం వినూత్న ఆందోళన చేపట్టారు. మోకాళ్లపై కూర్చొని చేతులు ఎత్తి దండం పెట్టి రోడ్డు వేయాలని పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, గతంలో ముగ్గురు చిన్నారులు వైద్యం అందక మృతి చెందారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరభద్రిపేట జంక్షన్ నుంచి మేయిన్ రోడ్డు వరకు కేవలం ఒక కిలోమీటర్ దూరమే ఉన్నప్పటికీ, కనీసం గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదని గ్రామస్థులు ఆరోపించారు. గతంలో బురదలో కూర్చొని నిరసన తెలియజేయగా, అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రతిపాదనలు పంపినప్పటికీ, నేటికీ అమలు కాలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేక చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వైద్య సేవలు పొందేందుకు కూడా డోలీలే ప్రత్యామ్నాయంగా మారాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు వేస్తామని చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారని, కానీ ప్రజా సమస్యలను పట్టించుకోరని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళనకు సిపిఎం నేత డి. వెంకన్న మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక గిరిజన నేతలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.