రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో తులసీబాబు పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఆయన రాజకీయం, వ్యాపారం, పోలీసు శాఖ మధ్య లింక్‌లు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వీధిరౌడీ మాదిరిగా వ్యవహరించి, పోలీసుల మద్దతుతో కోట్ల రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు, తులసీబాబు లీగల్ అడ్వయిజర్‌గా వచ్చాడు. అనంతరం ఐటీ కంపెనీ యజమాని అవతారం ఎత్తి, పోలీస్ హౌసింగ్ హోర్డు వెబ్‌సైట్ డాష్‌బోర్డు నిర్వహిస్తానంటూ రూ. మూడు కోట్లు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి పనులు జరగలేదు. అసలు డాష్‌బోర్డు ఏర్పాటు జరిగిందా అనే విషయమే అనుమానంగా మారింది.
పోలీసుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులు తులసీబాబు ఖాతాలోకి ఎలా వెళ్లాయి? ఈ వ్యవహారంపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. అటు పీవీ సునీల్ మాత్రం తులసీబాబు తనకు తెలియదని అంటున్నారు. కానీ వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం ఆయన మాటలతో విరుద్ధంగా ఉన్నాయి.
ఈ వ్యవహారం పోలీస్ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తులసీబాబు వ్యవహారంపై కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అధికారులు విచారణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు నిజాలు బయటపడతాయా లేదా అన్నది చూడాలి.