Chinmayi-Shivaji: టాలీవుడ్‌లో మరోసారి వ్యాఖ్యల వివాదం చర్చనీయాంశంగా మారింది. నటుడు శివాజీ చేసిన హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై వ్యాఖ్యలకు గాయనిగా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరున్న చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
శివాజీ వ్యాఖ్యలు
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, సినిమా ఈవెంట్లకు వచ్చే హీరోయిన్లు సంప్రదాయంగా చీరలు కట్టుకోవాలని సూచించారు. గతంలో సావిత్రి, సౌందర్య వంటి నటీమణుల ఉదాహరణలు ఇచ్చారు. ప్రస్తుత తరం నటీమణుల్లో రష్మిక దుస్తుల ఎంపికను మెచ్చుకున్నారు. అయితే గ్లామర్ పేరుతో హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలే తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
చిన్మయి కౌంటర్
శివాజీ వాడిన భాషను చిన్మయి తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల దుస్తులపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, అదే సమయంలో పురుషులు పాశ్చాత్య దుస్తులు వేసుకోవడంపై ఎలాంటి అభ్యంతరం చెప్పరా? అంటూ ప్రశ్నించారు. సంప్రదాయం గురించి మాట్లాడేవారు ముందు తమ ప్రవర్తనను కూడా పరిశీలించుకోవాలని ఆమె హితవు పలికారు.
సోషల్ మీడియాలో చర్చ
ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో విస్తృత చర్చకు దారి తీసింది. వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో మహిళలపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నదానిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఇంకా ఎంతవరకు కొనసాగుతుందో చూడాల్సి ఉంది.
ALSO READ:Telangana Politics | వదలొద్దు..కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వండి
