తమ ఉద్యోగ భద్రత కోసం గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు చేపట్టిన చలో ఐటీడీఏ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గత 23 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
చలో ఐటీడీఏ కార్యక్రమంలో భాగంగా, గురుకుల ఉపాధ్యాయులు కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఉదయం 10 గంటల నుంచే పోలీసు బందోబస్తు కొనసాగి, ఉద్యమకారులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏపీవో మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్ గయాజుద్దీన్ నిరసనకారులను సంప్రదించారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చినప్పటికీ, ఉపాధ్యాయులు తమ నిరసన కొనసాగించారు.
యుటిఎఫ్ నాయకులు ఎస్ మురళీమోహన్, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని అన్నారు. గత ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.