కలికిరిలోని జేఎన్టీయూ కళాశాల యూనివర్సిటీగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేత, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం జేఎన్టీయూ కళాశాల ఆధ్యాపకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అన్న, అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరిలో జేఎన్టీయూ కళాశాల స్థాపనకు ఎంతో కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, తెలుగు రాష్ట్రాల విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ కళాశాల కోసం తగిన ఏర్పాట్లు చేసి, యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలికిరి జేఎన్టీయూ కళాశాల అభివృద్ధికి మద్దతుగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
