రాజాం జిఎంఆర్ ఐటి ఎన్ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తాటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న 7 రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శుక్రవారం మూడో రోజు అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గ్రామంలో పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎం.పి.యూ.పి. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గార రాంబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో, మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాలపై ప్రభావం, ఆర్థిక నష్టాలను వివరించారు. ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్ల నినాదాలు గ్రామ ప్రజలను ఆలోచింపజేశాయి.
అనంతరం శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి, విజయనగరం వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 50 మందికి వైద్య సూచనలు ఇచ్చారు. 30 మందిని కాటారాక్ట్ ఆపరేషన్ కోసం ఎంపిక చేసి, విజయనగరం ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆసుపత్రి ప్రతినిధి లక్ష్మణ్ తెలిపారు. ఈ పరీక్షలను అప్తాలమిక్ సిబ్బంది కావ్య, పూజితలు నిర్వహించారు.
ఇక, విద్యార్థుల కోసం పలు పోటీలు నిర్వహించారు. ఎం.పి.యూ.పి. స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే, శ్రీకాకుళం మరియు విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకు, స్కూల్ విద్యార్థులకు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇచ్చారు.
ఈ మూడవ రోజు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కె.వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది వాలంటీర్లు తమ సేవలు అందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పి. చైతన్య కుమార్, కే. సత్యనారాయణ, సిహెచ్. మన్మధరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.