స్పీకర్ పదవి ఎవరికి గొప్పని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూకాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని తెలిపారు. ఆలయం నిర్మాణం గురించి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతాయుతమైన పదవికి తగదని అన్నారు.
గత మంగళవారం ఆలయం గురించి మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్న అని సంబోధించడంతో, ఒక టిడిపి కౌన్సిలర్ చేత తనపై విమర్శలు చేయించడం సరికాదని పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
2019 డిసెంబర్ తర్వాత టెండర్లు పిలిచి ఆలయం కట్టించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నిజానికి ఆలయ నిర్మాణ ప్రణాళిక, పనుల పురోగతి గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించబడిందని చెప్పారు. ఇప్పుడు దానిని టిడిపి హయాంలో కట్టిందని చెప్పుకోవడం స్పీకర్‌కు తగదని అన్నారు.
ప్రజలకు నూకాంబిక ఆలయం విశ్వాససంబంధమైన అంశమని, దీన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం తప్పని తెలిపారు. ఆలయ అభివృద్ధి పేరు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించొద్దని సూచించారు. తాను నిజాలను మాత్రమే మాట్లాడతానని, దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు.