ఆఫీసుకే వెళ్లకుండా 6 ఏళ్ల పాటు జీతం తీసుకున్న ఉద్యోగి మోసం స్పెయిన్‌లో బయటపడింది. కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో ప్లాంట్ సూపర్వైజర్‌గా పని చేసిన జోయక్విన్ గార్సియా 2004 నుంచి విధులకు హాజరు కాకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వచ్చాడు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అతనికి కలిసొచ్చాయి.
వాటర్ ప్లాంట్ నిర్వహణ విషయంలో రెండు విభాగాలు ఒకదానిపై మరొకటి భారం మోపుతూ వచ్చాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన గార్సియా, 2004 నుంచి ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. అయినప్పటికీ, కంపెనీకి ఆయన గైర్హాజరు విషయం తెలియకపోవడంతో, జీతం మాత్రం అతడి ఖాతాలో క్రమంగా జమవుతూ వచ్చింది.
ఇలా 6 ఏళ్ల పాటు ఉద్యోగం లేకుండానే జీతం తీసుకున్న గార్సియా వ్యవహారం 2010లో వెలుగులోకి వచ్చింది. ఇరవై ఏళ్లుగా సంస్థలో సేవలందించినందుకు గార్సియాను సన్మానించాలనుకున్న సమయంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కంపెనీ విచారణ చేపట్టి కోర్టులో కేసు వేసింది.
తాజాగా వెలువడిన తీర్పులో, గార్సియాపై 30 వేల డాలర్ల జరిమానా (మన రూపాయల్లో 25 లక్షలు) విధించారు. ఆఫీసుకు వెళ్లకపోయినా జీతం తీసుకోవడం కంపెనీ నష్టానికి కారణమైందని కోర్టు పేర్కొంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.