ఈనెల 8వ తేదీన మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో మొక్కజొన్న తోటలో కడియం శ్రీనివాసరావు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా, ఈ హత్య వెనుక అతని కొడుకు పుల్లారావు (32) హస్తం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని మైలవరం ఏసిపి వై ప్రసాదరావు అధికారికంగా ప్రకటించారు.
పుల్లారావు యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆస్తి తగాదాలతో తండ్రితో జరిగిన గొడవలో, పుల్లారావు అతడిని కొట్టి చంపాడని అంగీకరించాడు. పైగా, అతడు ఆన్‌లైన్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలై, తన తండ్రిని డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేశాడు. తండ్రి అంగీకరించకపోవడంతో హత్యకు పాల్పడ్డాడు.
కేసును తప్పుదోవ పట్టించేందుకు, పక్క పొలం యజమాని చల్లా సుబ్బారావుతో ఉన్న భూ వివాదాన్ని తెరపైకి తెచ్చి తప్పించుకోవాలని పుల్లారావు ప్రయత్నించాడు. కానీ, మైలవరం పోలీసులు సమర్థంగా దర్యాప్తు చేసి అసలు నిజాన్ని బయట పెట్టారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్, ఎస్సై కె.సుధాకర్, జి.కొండూరు ఎస్సై సతీష్ కుమార్, గంపలగూడెం ఎస్సై శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వారి కృషిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారు.