ఆర్థిక మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తనతో మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఎలా బురిడీ కొట్టించిందో ఆ వీడియోలో వివరించింది. ఆన్‌లైన్ స్కామర్ ఒకడు తనను తాను తన తండ్రి స్నేహితుడినని చెప్పడంతో యువతి ‘నమస్తే అంకుల్’ అంటూ స్వాగతించింది.
తండ్రికి తాను అప్పు ఇచ్చానని, ఇప్పుడా మొత్తాన్ని ఆమెకు ఆన్‌లైన్‌లో పంపబోతున్నానని చెప్పాడు మోసగాడు. మొత్తం రూ.12 వేలు ఇవ్వాలనగా.. మొదట రూ.10 వేలు పంపినట్లు తపాసా మెసేజ్ చూపించాడు. యువతి వాటి వచ్చాయని అంగీకరించగానే, మిగతా రూ.2 వేలు పంపిస్తూ, పొరపాటుగా రూ.20 వేలు పంపినట్లు మెసేజ్ చేశాడు.
“ఐయో అంకుల్ మీరు పొరపాటుగా ఎక్కువ పంపించారు” అంటూ అమాయకంగా నటించింది యువతి. వెంటనే మిగతా రూ.18 వేలు తిరిగి పంపమని మోసగాడు కోరాడు. అయితే యువతి స్కామ్‌ను పసిగట్టింది. అతని మెసేజ్‌ను ఎడిట్ చేసి రూ.18 వేలు తిరిగి పంపినట్లు చూపిస్తూ, ఫేక్ మెసేజ్ పంపింది.
అది చూసిన మోసగాడు తన ప్లాన్ ఫెయిలైనదని గ్రహించి “నువ్వు గడుగ్గాయే” అంటూ ఆశీర్వాదం చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ మొత్తం సంఘటనను మరో ఫోన్‌లో రికార్డ్ చేసిన యువతి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికీ హెచ్చరికగా ‘ఇలాంటి స్కాములకు బలవ్వకండి’ అంటూ సూచించింది.