ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముళ్లకట్ట వంతెన పక్కన ప్రైవేట్ రిసార్టులో సోమవారం ఉదయం హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు గుర్తించడంతో ఘటన మరింత ఉత్కంఠ రేపింది.
ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సూర్యాపేటకు చెందిన ఈ యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి ఒత్తిడి తెచ్చిందని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు కూడా నమోదు అయిందని సమాచారం.
హరీశ్‌కు ఈ యువతి గతంలో పరిచయమై ప్రేమకు దారితీసింది. అయితే ఆమె నిజస్వరూపం తెలుసుకున్న హరీశ్ పెళ్లికి నిరాకరించగా, ఆమె గర్భవతి అంటూ భయపెట్టినట్లు సమాచారం. ఈ ఒత్తిడి తట్టుకోలేక, పరువు పోతుందనే ఆందోళనతో హరీశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసు శాఖలో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన హరీశ్ మరణం కుటుంబసభ్యులకు, స్నేహితులకు తీవ్ర దుర్భరంగా మారింది. ఈ ఘటనలో పూర్తి నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజాన్ని కుదిపేసిన ఈ ఘటన అందరిలో తీవ్ర ఆవేదన కలిగించింది.