- అన్నీ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
- నెల్లూరు 16వ డివిజన్ చెక్కలతూము, సర్వేపల్లికాలువ, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన
- నగరంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సర్వే చేపట్టాలని ఆదేశం
- కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే తొలగించేందుకు సన్నద్ధం
- భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు
- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు నగరాభివృద్ధి, సింహపురి ప్రజల భవిష్యత్ సౌకర్యార్థం ఆపరేషన్ బుడమేరును నెల్లూరులో యుద్ధప్రాతిపదికన స్టార్ట్ చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ చెక్కలతూము, సర్వేపల్లి కాలువ, తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, గ్రీన్ కార్పొరేషన్ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. క్షేత్రస్థాయిలో స్వయంగా మంత్రి పారుదల కాలువలను పరిశీలించి, ఆయా పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. వారు అడిగి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. డివిజన్‌కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి బొకేలు అందజేసి… తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వేచేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామన్నారు. నెల్లూరు మధ్యలో నుంచి వెళుతున్న సర్వేపల్లి కెనాల్, అదికాకుండా రామిరెడ్డి కెనాల్, ఊయ్యాలకాలువ, మల్లప్పకాలువలు గతంలో ఎప్పుడు నుంచే ఉన్నాయన్నారు.
2015లో వచ్చిన వరద వల్ల అప్పట్లో సిటీ మునిగిపోయిందని తెలిపారు. భవిష్యత్‌లో అలా కాకుండా ఉండేందుకు ఓ మాస్టార్ ప్లాన్‌తో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బుడమేరు వరదల వల్ల 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని, వారికి సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ఉదృతి వల్ల ప్రభుత్వం సైతం అవస్థలు పడిందని తెలిపారు. కానీ ఇలాంటి పరిస్థితులు మరెక్కడ జరగకూడదనే రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో ఆపరేషన్ బుడమేరును స్టార్ట్ చేశామని మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే అన్నీ శాఖల అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసలు కాలువల స్థితిగతులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఆ మేరకు ఆక్రమణల తొలగింపు ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుందని మంత్రి ఘంఠాపదంగా చెప్పారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో చూసుకుంటే చాలా చోట్ల కాలువలు ఆక్రమణలకు గురై మురికినీరు గానీ, వరద నీరు గానీ వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. పేదలు నిరుపేదలు ఒకవేళ ఆక్రమించుకుని ఉంటే వారికి ప్రత్యామయ్నం చూపిస్తామని, అలాకాకుండా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైన ఆక్రమంగా ఆక్రమించుకుని ఉంటే ఖచ్చితంగా ఆ ఆక్రమ కట్టడాలను తొలగించడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.