పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగింది. ఈరోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో త్రివిధ దళాధిపతులు మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) తో అత్యవసర భేటీ నిర్వహించారు. గురువారం రాత్రి రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై పాక్ డ్రోన్లు మరియు మిస్సైల్ దాడులకు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన తరువాత, ఈ సమావేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిణామాలను పరిశీలించి, భద్రతా వ్యూహాలను పునర్మూల్యాంకనం చేయడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం.
భారత సైన్యం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ సిందూర్” అనే గూఢచర్యా మిషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్) మరియు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించాయి. తొమ్మిది విభిన్న ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ, భారత్ సరిహద్దు ప్రాంతాలైన పఠాన్‌కోట్, ఉధంపూర్, జమ్మూ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు యత్నించింది. కానీ భారత బలగాలు అప్రమత్తంగా స్పందించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ ఆర్మీ పొస్టులపై కూడా భారత్ కౌంటర్ దాడులు జరిపింది. దీనివల్ల సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భద్రత పరంగా దేశం ఎదుర్కొంటున్న ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ అన్ని శాఖలతో సమన్వయంతో ముందుగానే వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రజల భద్రతకు ముప్పుగా మారే ఏ చర్యనైనా భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందన్న సంకేతం ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి పంపించబడింది. దేశ భద్రతే ప్రథమమన్న ఉద్దేశంతో భారత బలగాలు అపార ధైర్యంతో పని చేస్తున్నాయి.