జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024-25 వానకాలం సీజన్లో రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా కంది కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
కంది కొనుగోలు కోసం జిల్లాలోని ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ, పుటాన్ దొడ్డి, గద్వాల మార్కెట్లలో ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆలంపూర్, వడ్డేపల్లి మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు ₹7,550గా నిర్ణయించిందని, రైతులు నాణ్యమైన కందులను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, మార్క్ ఫెడ్ డిఎం గౌరీ నగేష్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ ఉపేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రతి అధికారికి బాధ్యత ఉన్నదని కలెక్టర్ హితవు పలికారు.