ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను, ఫిర్యాదులను యంత్రాంగం దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల తహసీల్దార్, ఎం పి డి ఓ లతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 40 దరఖాస్తులను అదనపు కలెక్టర్లు రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలసి స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదు లను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదును సమీక్షించడానికి ప్రత్యేకంగా ప్రతి కార్యాలయంలో అధికారికి బాధ్యత అప్పగించాలని సూచించారు. ప్రతి సోమవారం పిర్యాదుల దరఖాస్తులు పరిష్కారంపై పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉండాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలను మరింత సమర్థంగా అందజేసే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు వివిధ విభాగాలకు పంపించడం జరిగిందని, వాటిని పరిష్కరించడానికి నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమములో ఆర్ డి ఓ కె సత్యపాల్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.