ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవహేళన చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన సభ ఏర్పాటు చేసి, అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి పూలమాలతో అలంకరించారు.
నిరసనగా, అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం బస్టాండ్ రింగ్ సెంటర్లో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తొలగించి, మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి ప్రవేశపెట్టే కుట్రలకు పాల్పడుతోందని నాయకులు విమర్శించారు.
నాయకులు మాట్లాడుతూ, బిజెపి-ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కారణంగా మైనార్టీలు, క్రైస్తవుల భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. అంబేద్కర్ విలువలను కించపరచే చర్యలకు కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, ఉడతనే అప్పారావు, సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ, సిపిఎం నాయకులు పాండు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.