టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనారోగ్యానికి గురయ్యారు. హైబీపీ సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
ఇటీవల విష్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ సినిమాలో 150 మేకలు ఉన్నాయని, చివరికి 11 మేకలు మిగిలాయని కామెంట్ చేశారు. దీనిని వైసీపీపై చేసిన వ్యంగ్యంగా పార్టీ శ్రేణులు భావించారు. 2019లో వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉండగా, 2024లో 11 మంది మాత్రమే గెలిచారని సోషల్ మీడియాలో చర్చ నడిచింది.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాయ్‌కాట్ లైలా’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో, విష్వక్ సేన్ వివరణ ఇచ్చే అవసరం ఏర్పడింది. పృథ్వీ ఒక నటుడుగా చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఆయన మాటలతో చిత్రబృందానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ వివాదం పెరుగుతున్న సమయంలోనే పృథ్వీ అనారోగ్యం పాలవడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వైద్యులు ప్రస్తుతం పృథ్వీ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని సమాచారం.