మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో గత కొద్దిరోజులుగా విద్యుత్ సమస్యలు ఎదురవుతుండడంతో, మాజీ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శంకర్‌కు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామంలో నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పి.టి.ఆర్ ఏర్పాటు చేశారు. పి.టి.ఆర్ అమరికతో గ్రామానికి నిరంతర విద్యుత్ అందించవచ్చని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో విద్యుత్ సమస్య తీరుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ. శంకర్ మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్తులు తమ బకాయి విద్యుత్ బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడిఈ యాదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్, బనప్ప గారి నర్సారెడ్డి, మంగలి ప్రభాకర్, రవికుమార్, సత్యనారాయణ, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, స్పందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.