జిల్లాలో మహిళ రక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో “పోలీస్ అక్క” పేరుతో మహిళా కానిస్టేబుళ్లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు.
“పోలీస్ అక్క”గా ఎంపికైన కానిస్టేబుళ్లు షీ టీమ్‌తో కలిసి పనిచేస్తూ, పాఠశాలలు, కళాశాలల్లో సందర్శనలు చేస్తారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీసింగ్, మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా సమస్యలు ఎదురైనప్పుడు శీ టీమ్, డయల్ 100 వంటి నంబర్లను అందుబాటులో ఉంచుతారు.
జిల్లాలో ఆకతాయిల అటకట్టిస్తూ మహిళా, విద్యార్థుల భద్రతను కాపాడేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం 52 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని 60 కేసులు నమోదు చేశారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, వేధింపుల పట్ల నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రెని ఎస్‌ఐ వీనిత, షీ టీమ్ సిబ్బంది, మహిళ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎన్నికైన 13 “పోలీస్ అక్క”లు తమ బాధ్యతలు స్వీకరించి, మహిళల భద్రత కోసం పనిచేయాలని అభినందనలు అందుకున్నారు.
