PM Modi on Vande Mataram: వందేమాతరం కేవలం పాట కాదని, ఇది భారతీయ దార్శనికతను ప్రతిబింబించే శాశ్వత దిక్సూచి అని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటించారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చను ప్రారంభిస్తూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ గీతం యుద్ధ నినాదంగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్ర్య సమర కాలంలో ఈ గీతం దేశానికి ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించిందని గుర్తు చేశారు.
ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తైనప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉన్నదని, 50 సంవత్సరాలు పూర్తైనప్పుడు దేశం పరాయి పాలనలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం 1875లో బంగదర్శన్‌లో మొదటిసారిగా ప్రచురితమై, 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళనలో ప్రముఖ పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ఈ చర్చకు 10 గంటలు సమయం కేటాయించగా, ప్రధాని తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్, ప్రియాంకా గాంధీ తదితరులు ప్రసంగించనున్నారు. రాజ్యసభలో చర్చను అమిత్ షా ప్రారంభించనున్నారు.
ఈ గీతం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమానికి అనుసంధానమై, 1950 జనవరి 24న జాతీయ గీతంగా గుర్తింపు పొందిందని మోడీ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
