నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద శనివారం భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న వరి ధాన్యం పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఏడు లారీలు, 2200 ధాన్య బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఈ ధాన్యాన్ని తెలంగాణలో ప్రభుత్వ బోనస్‌ను పొందేందుకు కేటుగాళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేరే రాష్ట్ర ధాన్యాన్ని ఇక్కడ విక్రయించడం నిషేధంగా ఉండటంతో, ఈ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న దళారులపై కేసులు నమోదు చేశారు.
రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజశేఖర్ రాజ్ మాట్లాడుతూ, “రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకునేందుకు చెక్ పోస్ట్‌లను బలోపేతం చేశాం” అని తెలిపారు.
ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా స్థానిక రైతులకు న్యాయం జరిగేలా చూడటం ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లతో ఇటువంటి అక్రమ రవాణాను నియంత్రించనున్నామని వెల్లడించారు.