నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు పంచాయతీలో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీసింది. రహదారి ఆక్రమణలు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆదేశాల మేరకు రెవిన్యూ, రోడ్డు భవనాల శాఖ సంయుక్తంగా మంగళవారం తొలగింపుకు శ్రీకారం చుట్టాయి.
అయితే, అధికారుల చర్యల్లో పక్షపాతం ఉందని టిడిపి నేతలు ఆరోపించారు. ఒక ప్రాంతంలో పూర్తిగా మార్కింగ్ మేరకు తొలగింపు జరగగా, మరొక ప్రాంతంలో అదే విధంగా అమలు చేయలేదని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు అధికారుల తీరును ప్రశ్నించగా, వైసిపి నేతలు ఆక్రమణ తొలగింపు సర్వేలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
అధికారుల తీరుపై స్థానికులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆక్రమణదారులను వదిలేస్తూ, మరికొందరిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని ప్రజలు అంటున్నారు. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నిజమైన బాధితులను తక్షణమే రహదారిపై నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణ తొలగింపును పాక్షికంగా కాకుండా సమగ్రంగా చేపట్టి, అందరికీ సమాన న్యాయం జరగాలని వారు అభిప్రాయపడుతున్నారు.