బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నందున కోళ్ల ఫారాలు, చికెన్ సెంటర్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.సత్యన్న డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మిగనూరులో మునిసిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కోళ్లు మరణిస్తున్నాయనీ, ఇటీవల కర్నూలులో రెడ్ జోన్ ప్రకటించి చికెన్ అమ్మకాలపై ఆంక్షలు విధించారనీ తెలిపారు.
కారణంగా పట్టణంలోని కొన్ని కోళ్ల ఫారాలు, చికెన్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు ఆ వ్యర్థాలను తిని ప్రజలపై దాడి చేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా న్యూ ఎస్సీ కాలనీ సమీపంలోని వంకలో కోళ్ల వ్యర్థాలను పారేస్తున్నారని విమర్శించారు.
కోళ్ల ఫారాల వల్ల స్థానిక ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పట్టణ పరిసరాల్లో కోళ్ల వ్యర్థాలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే కోళ్ల ఫారాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎస్.బాలరాజు, బాబు, మల్లిఖార్జున, నరసింహులు, యువరాజ్, నరేశ్, పి.వై.ఎల్ నాయకులు మునెప్ప, ఏఐకేఎంఎస్ నాయకులు పెద్దారెడ్డి, జయరాజు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.