రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన ఓమ్ని వెహికల్ నిర్లక్ష్యంతో, నాలుగేళ్ల చిన్నారి రిత్విక ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ వెహికల్ నుంచి దిగిన చిన్నారి ముందుకు నడుస్తుండగా, డ్రైవర్ వెహికల్‌ను రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. చాలా స్కూళ్లలో ఓమ్ని వాహనాలకు సరైన అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. టైర్లలో గాలి కూడా సరిగ్గా ఉండకపోవడంతో, పిల్లల ప్రాణాలను స్కూల్ నిర్వాహకులు ఆటలాగా చూస్తున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. స్కూల్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యానికి తగిన శిక్ష వేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎంఈఓ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను ప్రశ్నించగా, ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.