ముంబై శివారు చెంబూర్‌లోని అనిక్ విలేజ్‌లో ఉన్న కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆలయ పూజారి కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగు పూసి, బంగారు వస్త్రాలు, కిరీటం, సిలువ వంటి క్రైస్తవ చిహ్నాలను జోడించాడు.
అమ్మవారి చేతిలో శిశువు ఏసును పోలిన బొమ్మను కూడా ఉంచడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే దీనిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
ALSO READ:కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, పూజారిని అరెస్ట్ చేశారు. విచారణలో పూజారి తనకు కలలో దేవత దర్శనమిచ్చి మేరీమాత రూపంలో అలంకరించమని చెప్పిందని వాదించాడు. ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు అధికారులు మరియు పోలీసులు విగ్రహాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చారు.
కోర్టులో హాజరైన పూజారికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరైంది. మతపరమైన భావాలను దెబ్బతీసే చర్యలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? లేదా వ్యక్తిగత చర్యేనా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
