జిహెచ్ఎంసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం కొనసాగిస్తుందని మాదిగ ఆర్టీసీ కార్మికుల జాతీయ ఇన్‌చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు. బేబీ ఆరాధ్య మనోహర్ పుట్టినరోజు సందర్భంగా మట్టిపల్లి యాదమ్మ అమృతధార ట్రస్ట్, సెవెన్ రా ఫౌండేషన్ సంయుక్తంగా మల్కాజిగిరి బాలా సరస్వతి నగర్‌లో ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మణ్ మాదిగ, అమృతధార ట్రస్ట్ చైర్మన్ బట్టిపల్లి రఘురాములు, వైస్ చైర్మన్ మనోహర్, హైకోర్టు న్యాయవాది నజీర్ హైమద్, సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్ తిప్పారపు కీర్తి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులకు బట్టలు పంపిణీ చేసి, వారి సేవలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ, జిహెచ్ఎంసి కార్మికుల సేవలు మహానగరానికి అమూల్యమని, ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. పుట్టినరోజు వేడుకలను వృధా ఖర్చులు చేయకుండా కార్మికుల సహకారానికి వినియోగించడం గొప్ప అనుభవమని అన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి పారిశుద్ధ్య కార్మికుల హక్కులను సాధించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందని, అంబేద్కర్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మికుల న్యాయానికి ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులు, మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.