RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన ‘100 వ్యాఖ్యాన్ మాల’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత సంస్కృతిని గౌరవించేంతవరకూ దేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని పేర్కొన్న భాగవత్, భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ALSO READ:PM Modi – Luxon | మోడీ–లక్సన్ ఫోన్ సంభాషణలో కీలక ఒప్పందం
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని ఉదాహరణగా పేర్కొంటూ, ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ విషయానికి రాజ్యాంగ అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. అయితే, భవిష్యత్తులో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించి ఆ పదాన్ని చేర్చాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న అపోహలపై స్పందించిన భాగవత్, హిందుత్వానికి కులవ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పుట్టుక ఆధారంగా కులాలను నిర్ణయించే విధానానికి ఆర్‌ఎస్‌ఎస్(RSS) మద్దతు ఇవ్వదని, అది హిందుత్వ లక్షణం కాదని చెప్పారు.
అలాగే, తమ సంస్థ ముస్లింలకు వ్యతిరేకం కాదని, పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. సందేహాలు ఉన్నవారు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలకు వచ్చి ప్రత్యక్షంగా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
