ఖమ్మం జిల్లా తల్లాడలో ఏర్పాటు చేసిన ఓగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ బయోమాస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన ప్లాంట్‌ను ప్రారంభించగా, ఆధునిక యంత్రాలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, బయోమాస్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల రైతులు ప్రత్యక్షంగా లాభపడతారని, అలాగే ఇంధన పరిశ్రమలో సరికొత్త మార్గం ఏర్పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంధన అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, స్థానికంగా బయోమాస్ ప్లాంట్ల ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేయడం చాలా ప్రయోజనకరమని వివరించారు. దేశవ్యాప్తంగా బయోమాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ప్లాంట్ ప్రారంభోత్సవంలో స్థానిక రాజకీయ ప్రముఖులు ఎమ్మెల్యే రాముతో ముచ్చటించారు. పలువురు నేతలు, రైతు సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బయోమాస్ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రైతుల ఉత్పత్తులను వినియోగించి శక్తిని ఉత్పత్తి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యావరణ పరిరక్షణలోనూ ఇది కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఓగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు వెనిగండ్ల మదన్ కిషోర్, పలువురు రాజకీయ నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాము ప్లాంట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.