ఎంఎఫ్ హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం రూ.118 కోట్లు పలికింది

MF Husain’s painting ‘Gramayatra’ sold for ₹118 crore, making it the most expensive Indian artwork ever. MF Husain’s painting ‘Gramayatra’ sold for ₹118 crore, making it the most expensive Indian artwork ever.

భారతీయ ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ‘గ్రామయాత్ర’ చిత్రం రికార్డుస్థాయి ధరను సాధించింది. ఈ చిత్రం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ వేలంలో రూ. 118 కోట్లకు అమ్ముడై భారతీయ చిత్ర కళా రంగంలో అత్యంత ఖరీదైన కళాఖండంగా నిలిచింది. ఈ నెల 19న జరిగిన ఈ వేలంలో హుస్సేన్ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది.

1950లలో హుస్సేన్ గీసిన ఈ చిత్రం, స్వాతంత్ర్యం పొందిన భారతదేశ గ్రామీణ సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. 14 అడుగుల కాన్వాస్‌పై గీయబడిన ఈ కళాఖండం భారతీయ గ్రామీణ జీవనశైలిని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు.

ఇప్పటివరకు భారతీయ చిత్ర కళలో అత్యధిక ధర పలికిన కళాఖండంగా అమృతా షేర్‌గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ ఉంది. 2023లో ముంబైలో జరిగిన వేలంలో ఈ చిత్రానికి రూ. 61.8 కోట్ల ధర పలికింది. కానీ ఇప్పుడు హుస్సేన్ గీసిన ‘గ్రామయాత్ర’ ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రాన్ని తాజాగా వేలంలో అమ్మిన డబ్బును ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రి వైద్య విద్యార్థుల శిక్షణ కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుస్సేన్ చిత్ర కళ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా ఉందని కళా నిపుణులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *