మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న లోకేష్‌కు కుటంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి నామస్మరణలతో భక్తులతో కలిసి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ వేది పండితులు మంత్రి నారా లోకేష్‌కు ఆశీర్వచనాలు అందించారు. మహోత్సవం అనంతరం ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలపై భక్తులతో చర్చించారు. భక్తుల ఉత్సాహానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు.
విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా పరిష్కారం చూపిస్తానని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గ్రామ మాజీ సర్పంచ్ భీమవరపు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.