పరారీలో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మరోసారి ఇరకాటంలో పడ్డారు. వనౌటు ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. భారత్‌కు అప్పగింతను తప్పించుకోవడానికి లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్టును ఉపయోగిస్తున్నారని ఆరోపణలు రావడంతో, ప్రధాని జోథం నపట్ అధికారులను ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆదేశించారు.
ఇటీవల లలిత్ మోదీ లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో తన భారత పాస్‌పోర్టును అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదే సమయంలో వనౌటు ప్రభుత్వం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయనున్నట్లు ప్రకటించడంతో మోదీ భవితవ్యం మరింత సంక్షోభంలో పడింది. త్వరలో ఆయనపై భారత్ తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
ఐపీఎల్ మాజీ చీఫ్‌గా లలిత్ మోదీ తన హయాంలో వేల కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. అవినీతి కేసుల నేపథ్యంలో దేశం విడిచిపోయిన ఆయనను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఆయన పలు దేశాల్లో నివాసం మారుస్తూ భారత దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకున్నారు.
తాజా పరిణామాలతో, లలిత్ మోదీ ఎక్కడ ఆశ్రయం పొందబోతారన్న ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. వనౌటు ప్రభుత్వం అధికారికంగా పాస్‌పోర్టును రద్దు చేసిన వెంటనే, ఆయనను భారత్‌కు అప్పగించే చట్టపరమైన ప్రక్రియ వేగం పొందే అవకాశం ఉంది. భారత అధికార వర్గాలు ఈ అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తున్నాయి.