గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్న ఈ కేసులో, సత్యవర్ధన్ స్టేట్మెంట్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులకు అందజేసింది. కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ అవసరమని కోర్టును కోరగా, కోర్టు అనుమతి మంజూరు చేసింది.
ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబులకు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణను వేగవంతం చేసేందుకు వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీ తనను వేరే బ్యారక్‌కు మార్చాలని కోర్టును కోరాడు. దీనిపై ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఈరోజు కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
కిడ్నాప్ కేసు నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండగా, వైసీపీ వర్గాలు తమకు సంబంధం లేదని చెబుతున్నాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగుచూడనున్నాయి.