నరసరావుపేట ఇరిగేషన్ SE కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. SE కృష్ణ మోహన్, EE సుబ్బారావు తాము రాజకీయ వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే వత్తిడి తేవడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఇద్దరు ఉద్యోగులను SE, EE తక్షణమే మాచర్లకు బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ చర్యను ఉద్యోగులు అవాంఛనీయమని, తమను భయపెట్టడానికి ఉద్దేశించిందని ఆరోపిస్తున్నారు. తాము న్యాయం కోసం నిలబడ్డామంటే ఇలా బదిలీలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
SE, EE తీరుతో విసిగిపోయిన ఉద్యోగులు కార్యాలయంలోనే నేలపై కూర్చొని నిరసన తెలిపారు. తమను బెదిరించడం, పనిభారాన్ని ఎక్కువ చేయడం, రాజకీయ ఒత్తిడులకు గురిచేయడం జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మరింత తీవ్రమైన ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ సంఘటన ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని రేపింది. SE, EE తక్షణమే తమ తీరును మార్చుకోవాలని, బాధిత ఉద్యోగులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.