నెల్లూరు జిల్లాలో సాగుచేసిన బీపీటీ రకం ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ సీజన్ భిన్నంగా ఉంటుందని, ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రైతులు ప్రధానంగా బీపీటీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకాలని సాగు చేసినప్పటికీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ పండించిన రైతులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, బీపీటీ రైతులు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నారని తెలిపారు. రూ.19,700 కనీస మద్దతు ధర ఉండాల్సిన చోట, రైతులు రూ.16,000 – 17,000కే అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు.
ఇటీవల సివిల్ సప్లయీస్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా బీపీటీ పంట 1.50 లక్షల ఎకరాల్లో సాగుచేసినట్లు వెల్లడించారు. రైతులు ఒక్కో ఎకరాకు రూ.12,000 వరకు నష్టపోతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2018లో చంద్రబాబు నాయుడు హయాంలో, రాత్రి 11 గంటల వరకూ సమావేశమై బీపీటీ రైతులకు క్వింటాలుకు రూ.200 బోనస్ ఇప్పించిన అనుభవాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రులు సమగ్ర చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.