T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026 లో భారత్–పాకిస్థాన్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్‌కు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాతో తలపడేందుకు పాకిస్థాన్ అధికారికంగా ఓకే చెప్పిన వెంటనే, మ్యాచ్ వేదికగా ఉన్న కొలంబోకు వెళ్లే విమానాలపై భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా విమాన టికెట్ ఛార్జీలు క్షణాల్లోనే రెట్టింపు స్థాయికి చేరాయి.
ఆదివారం జరగనున్న ఈ ఇండో–పాక్ సమరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున శ్రీలంకకు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై–కొలంబో మధ్య విమాన టికెట్ ధర ఒక్కసారిగా దాదాపు ₹10,000 వరకు పెరిగినట్లు ట్రావెల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఫిబ్రవరి 15న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి, ముంబై–కొలంబో–ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధర ప్రస్తుతం సుమారు ₹60,000 వరకు చేరిందని సమాచారం.
ఇండో–పాక్ మ్యాచ్‌కు తగ్గట్టుగానే విమాన ఛార్జీల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్ వివరాల ప్రకారం, చండీగఢ్ నుంచి కొలంబోకు ఎయిర్ ఇండియా రౌండ్ ట్రిప్ ఛార్జీ సుమారు ₹63,000గా ఉంది. ఇక ఇండిగో విమానాల ధరలు ₹70,000 నుంచి ₹74,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ–కొలంబో మధ్య ప్రయాణానికి కూడా ఆ తేదీల్లో టికెట్ ధరలు దాదాపు ₹45,000 వరకు పలుకుతున్నాయి.
ఇండియా–పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగ లాంటిదే. అదే ఉత్సాహం ఇప్పుడు ట్రావెల్ రంగంపైనా ప్రభావం చూపుతోంది. మ్యాచ్ తేదీ దగ్గరపడే కొద్దీ ఛార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు.
