హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. బిల్డర్స్‌కు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు పది వేల కోట్ల రూపాయలు కేటాయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక సిద్ధమవుతోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా, పర్యావరణహితంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మూసీ నదికి పునర్జీవం ఇవ్వడం కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. భవిష్యత్తులో నగర వృద్ధికి ఆటంకాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని, బిల్డర్స్‌కు కావాల్సిన అన్ని అనుమతులు వేగంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.