Himanta Biswasarma | కాంగ్రెస్‌పై సీఎం హిమంత పరువునష్టం దావా

Himanta Biswasarma defamation case against Congress Himanta Biswasarma defamation case against Congress

Himanta Biswasarma: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswasarma) తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులపై పరువునష్టం దావా (Defamation Case) దాఖలు చేసినట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకులు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు “1200 బిఘాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని” ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతోనే కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

ఈ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు “జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్” లపై రూ. “500 కోట్ల నష్టపరిహారం” కోరుతూ న్యాయపోరాటం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ సీఎం హిమంతపై మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అస్సాం రాజకీయాల్లో మరింత ఉద్రిక్తత నెలకొంది.

ఈ అంశంపై అస్సాం కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అస్సాం బీజేపీ సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ, గువాహటిలోని ఒక పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అధికార – ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ పోరు చివరకు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *